Wednesday, December 6, 2006

జయభేరి

నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!

నేను సైతం
విశ్వవ్రుష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!

నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!

ఎండాకాలం మండినప్పుడు
గబ్బిలవలె
క్రాగిపోలేదా!

వానాకాలం ముసిరిరాగా
నిలివు నిలువున
నీరు కాలేదా?
శీతాకాలం కోతపెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే!

నే నొక్కణ్ణే
నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు
భూమి మీదా
భగ్నమౌతాయి!

నింగినుండీ తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!

పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!

నే నొకణ్ణీ ధాత్రినిండా
నిండిపోయీ-
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తా లాగమిస్తాయి!

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!

నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్చనలు పోతాను!

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

3 comments:

Unknown said...

i dont have words to comment(praise),simply your work is invaluble,after somany searches i got this blog.i am fan of sri sri.
meeku satakoti vandanalu.

Unknown said...

What to say ........This is the best blog i ever found in telugu . I found this after somany hits against sri sri . Really excellent work . Keep Going with more posts ..........

AGBMSO said...

శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

కూలివాని గుండెలొ ఆవేదన ఉందని

కార్మికుని కడుపులో ఆకలి రగిలందని

కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ


మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దోపిడిదారుల దురంతాలు సాగవని

పీడకుల పాలన మాకిక వద్దని

గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ


మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

దగాపడ్డ తమ్ములార ఏకంకండని

మోసపోక యికనైనా మేలుకొండని

మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ

మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు

By Ramamohan Chinta.