Wednesday, December 6, 2006

బాటసారి

కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని-
తల్లిమాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్కతీరుగ
నడుస్తున్నా దిక్కు తెలియక-
నడి సముద్రపు నావ రీతిగ
సంచరిస్తూ, సంచలిస్తూ,
దిగులు పడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే-
చండ చండం, తీవ్ర తీవ్రం
జ్వరం కాస్తే,
భయం వేస్తే,
ప్రలాపిస్తే-
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వరదవస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం!

కళ్ళు వాకిట నిలిపిచూచే
పల్లెటూళ్ళో తల్లి ఏమని
పలవరిస్తుందో...?
చింతనిప్పులలాగు కన్నుల
చెరిగిపోసే మంటలెత్తగ,
గుండుసూదులు గ్రుచ్చినట్లే,
శిరోవేదన అతిశయించగ,
రాత్రి, నల్లని రాతి పోలిక
గుండె మీదనె కూరుచుండగ,
తల్లిపిల్చే కల్ల ద్రుశ్యం
కళ్ళ ముందట గంతులేయగ
చెవులుసోకని పిలుపులేవో
తలచుకుంటూ-
తల్లడిల్లే,
కెళ్ళగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం!

అతని బ్రతుకున కదే ఆఖరు!
గ్రుడ్డి చీకటిలోన గూబలు
ఘూంకరించాయి..
వానవెలసీ మబ్బులో ఒక
మెరుపు మెరిసింది..
వేగు జామును తెలియజేస్తూ
కోడి కూసింది..
విడిన మబ్బుల నడుమనుండీ
వేగుచుక్కా వెక్కిరించింది..
బాటసారి కళేబరంతో
శితవాయువు ఆడుకుంటోంది!
పల్లెటూళ్ళో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది!

No comments: