Wednesday, December 6, 2006

జగన్నాథ రధచక్రాలు

జగన్నాథ రధచక్రాలు
పతితులార!
భ్రష్టులార
బాధాసర్ప దష్టులార!
బ్రతుకు కాలి,
పనికిమాలి,
శని దేవత రధచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార!
హీనులార!
కూడు లేని, గూడు లేని
పక్షులార!భిక్షులార!
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్క్రుతులు,
సంఘానికి బహిష్క్రుతులు
జితాసువులు,
చ్యుతాశయులు,
హ్రుతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి!
మీ రక్తం, కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం ఏడవకండి!
ఓ వ్యధా నినిష్టులార!
ఓ కధా వశిష్టులార!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
ఏడవకం డేడవకండి!

వస్తున్నా యొస్తున్నయి...
జగన్నాధ,
జగన్నాధ,
జగన్నాధ రధచక్రాల్!
జగన్నాధుని రధచక్రాల్!
రధచక్రాల్,
రధచక్రాల్,
రధచక్రాల్, రధచక్రా
లొస్తునా యొస్తునాయి!

పతితులార!
భ్రష్టులార!
మొయిల్దారిని
బయల్దేరిన
రధచక్రాల్, రధచక్రా
లొస్తునా యొస్తున్నాయి!

సింహాచలం కదిలింది,
హిమాలయం కరిగింది,
వింధ్యాచలం పగిలింది -
సింహాచలం,
హిమాచలం,
వింధ్యాచలం, సంధ్యాచలం...
మహానగా లెగురుతున్నాయి!
మహారధం కదులుతున్నాది!
చూర్ణమాన
ఘార్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్
గిర గిర గిర తిరుగుతున్నాయి!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
రారండో! రండో! రండి!

ఊరవతల నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ
గోనెలతో, కుండలతో,
ఎటుచూస్తే అటు చీకటి,
అటు దుఃఖం, పటునిరాశ -
చెరసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య!
దగాపడిన తమ్ములార!
మీ బాధలు నే నెరుగుదును..
. వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీ గాధలు
అవగాహన నాకవుతాయి
పతితులార!
బ్రష్టులార!
దగాపడిన తమ్ములార!
మీ కోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట
అడావుదిగ వెళిపోయే,
అరచుకుంటు వెళిపోయే
జగన్నాధుని రధచక్రాల్,
రధచక్ర ప్రలయఘోష
భూమార్గం పట్టిస్తాను!
భూకంపం పుట్టిస్తాను!

నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట!
నిటాలాగ్ని రగిలిందట!
నిటాలాగ్ని!
నిటాలార్చి!
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది!

అరె ఝాం! ఝాం!
ఝుటక్, ఫటక్ ...

హింసనచణ
ధ్వంసరచన
ధ్వంసనచణ
హింస రచన!
విషవాయువు, మర ఫిరంగి,
టార్పీడో, టోర్నాడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది?
సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ!
హాలాహలం పొగచూరింది!
కోలాహలం చెలరేగింది
పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెరిగిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట-
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచి పెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళు లేచి,
జనవాళికి శుభం పూచి -
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది!
ఈ స్వర్గం ఋజువవుతుంది!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!

1 comment:

sudheeru said...

neeku satileru...neeku sariraru evaru..nee ghosha nee asha ee andhra prajalu telusukune roju ravalani..korutu
mee abhimani
sudheer reddy